murugadoss: క్షమాపణ చెప్పను .. హామీ ఇవ్వను: దర్శకుడు మురుగదాస్
- మురుగదాస్ ను వెంటాడుతోన్న 'సర్కార్' వివాదం
- బహిరంగ క్షమాపణ కోరుతోన్న పార్టీ పెద్దలు
- వెనక్కి తగ్గని మురుగదాస్
మురుగ దాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన 'సర్కార్' చిత్రం 'దీపావళి' కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 250 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా, సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, దివంగత ముఖ్యమంత్రి జయలలితను కించపరిచే విధంగా వున్నాయంటూ ఆ పార్టీ కార్యకర్తలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఆందోళనలు చేశారు.
దాంతో ఈ సినిమా టీమ్ రంగంలోకి దిగి, అభ్యంతరకరమైనవిగా చెప్పబడుతోన్న కొన్ని సన్నివేశాలను తొలగించారు. అంతటితో ఆగని ఆ పార్టీ ప్రముఖులు కొందరు, జరిగినదానికి మురుగదాస్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని పట్టుపడుతున్నారు. అంతేకాదు ఇకపై ప్రభుత్వాలను విమర్శిస్తూ సినిమాలు చేయనని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా మురుగదాస్ స్పందిస్తూ .. 'నేను క్షమాపణ చెప్పను .. హామీ కూడా ఇవ్వను' అని తేల్చిచెప్పాడు. దాంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.