Rahul Gandhi: రాహుల్ వీణ, చంద్రబాబు ఫిడేల్ వాయించుకోవాల్సిందే!: మంత్రి కేటీఆర్ సెటైర్లు
- వీళ్లిద్దరి కలయిక జోగి జోగీ రాసుకున్నట్టే
- ‘తగుదునమ్మా’ అంటూ కండువాలు మార్చుకున్నారు
- కేవలం కేసీఆర్ ను గద్దె దించేందుకే ఈ పొత్తు
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి కేటీఆర్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లి లో నిర్వహించిన రోడ్ షో లో కేటీఆర్ మాట్లాడుతూ, చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి రాహుల్ ని కలిసి ఆయన చేతిలో వీణ పెడితే, బాబు చేతిలో రాహుల్ ఫిడేల్ పెట్టారని అన్నారు. డిసెంబర్ 11 తర్వాత రెండోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాహుల్ వీణ, చంద్రబాబు ఫిడేల్ వాయించుకోవడం తప్ప, అయ్యేదేమీ లేదని సెటైర్లు విసిరారు.
జోగి జోగీ రాసుకుంటే ఏం రాలుతుందో, వీళ్లిద్దరూ కలుసుకుంటే కూడా అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. నాడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి పుట్టిన టీడీపీ, ఈరోజున ‘తగుదునమ్మా’ అంటూ ఒకరి కండువాలు మరొకరు వేసుకుని, భుజాలపై చేతులు వేసుకుని ఊళ్లల్లోకి బయలుదేరారని దుయ్యబట్టారు. నాలుగు కండువాలు, ఐదు కండువాలు వేసుకుని వీళ్లు ఊళ్లల్లోకి పోతుంటే, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా అంటూ విమర్శలు చేశారు.
‘అయ్యో, సంక్రాంతి జనవరిలో కదా! గంగిరెద్దులోళ్లు ఇప్పుడెందుకొస్తున్నారు’ అని ప్రజలు అనుకునే పరిస్థితి ఉందంటూ సెటైర్లు విసిరారు. ఈ రెండు పార్టీలు ఏ ప్రాతిపదికన ఒకటయ్యాయి? ఏదైనా ప్రాతిపదిక ఉందా? ఎవరి కోసం పొత్తు పెట్టుకున్నారు? అని ప్రశ్నించారు.
‘2004లో కాంగ్రెస్ పార్టీతో మేం పొత్తు పెట్టుకున్నాం. ఎందుకు? సోనియాగాంధీ దిగొచ్చి.. కేంద్రంలో, రాష్ట్రంలో గెలిపిస్తే ‘తెలంగాణ’ ఇస్తానంటే పొత్తు పెట్టుకున్నాం. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. ఎందుకు? తెలంగాణ ఇస్తే నాకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు కేంద్రానికి ఉత్తరం రాస్తే అప్పుడు పొత్తుపెట్టుకున్నాం. ‘తెలంగాణ’ ప్రాతిపదికన పొత్తు పెట్టుకున్నాం’ అని వివరించారు. కేవలం కేసీఆర్ ను గద్దె దించడం కోసమే వారు పొత్తుపెట్టుకున్నారని, ఒక్క కేసీఆర్ ను ఎదుర్కోవడానికి ‘నలుగురు నలుగురు రావాలా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.