Rajasthan: రాజస్థాన్లో కాంగ్రెస్ నేతకు ఘోర అవమానం... నేలకు ముక్కును రాయించిన యువకులు!
- రాజస్థాన్ లోని సాగ్వారాలో ఘటన
- నీటి గుంతను దాటే క్రమంలో యువకులపై పడిన బురద
- చేజ్ చేసి అవమానించిన నలుగురు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ప్రాంతానికి వెళ్లిన రాజస్థాన్ కాంగ్రెస్ నేత భగవతి లాల్ కు ఘోర అవమానం ఎదురైంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సచిన్ పైలట్ సాగ్వారా పట్టణంలో జరిగే ర్యాలీకి బయలుదేరగా, ఆయన్ను కలిసేందుకు భగవతి వెళ్లిన వేళ ఈ ఘటన జరిగింది.
ఆయన కారు రోడ్డుపై వెళుతూ, కొందరు యువకులపై బురదను వెదజల్లింది. ఓ నీటి గుంటను గమనించకుండా డ్రైవర్ కారును నడపగా, బురద పడిందన్న ఆగ్రహంతో నలుగురు యువకులు కారును ఛేజ్ చేశారు. కొంతదూరం వెళ్లిన తరువాత కారును ఆపారు. చూడకుండా వెళ్లిన కారణంగానే అలా జరిగిందని క్షమాపణలు చెప్పినా వినకుండా, ఆయన్ను మోకాళ్లపై నిలిపి అవమానించారు. ఆపై నేలకు ముక్కును రాయించారు. మంగళవారం నాడు ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
దీనిపై దుగన్ పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ కుమార్ స్పందిస్తూ, ఆ యువకులు పాటీదార్ వర్గానికి చెందిన వారని, వారిని అదే వర్గం పెద్దలు పిలిపించి మందలించారని అన్నారు. వాళ్లతో కూడా నేలకు ముక్కు రాయించి క్షమాపణ చెప్పించారని, దీంతో వివాదం సద్దుమణిగిందని అన్నారు. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.