maoist: నన్ను చంపేసి నేరాన్ని మావోయిస్టుల మీద నెట్టివేసేందుకు కుట్ర చేస్తున్నారు!: రేవంత్ రెడ్డి
- ఇందుకోసం కొందరు అధికారులు రంగంలోకి దిగారు
- 4+4 భద్రత కల్పించాలని కోర్టు చెప్పినా పట్టించుకోలేదు
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
తెలంగాణ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్నందున తనను అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇందుకోసం నక్సల్స్ ఏరివేతలో పాల్గొంటున్న కొందరు పోలీస్ అధికారుల్ని ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దించారన్నారు. ఎన్నికల ప్రచారంలో తనను చంపేసి దానిని మావోయిస్టులపై నెట్టివేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఇలాంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు ఖమ్మం జిల్లాలోని పాలేరు, సత్తుపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చెప్పినప్పటికీ కేసీఆర్ ఒత్తిడితో కేంద్రం భద్రతను కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి తెలంగాణ హైకోర్టు తనకు 4 ప్లస్ 4 కేంద్ర బలగాల భద్రతను కల్పించాలని ఆదేశించినా, కేంద్రం ఇప్పటివరకూ స్పందించలేదని వాపోయారు.
ఈ నేపథ్యంలో నేటి నుంచి 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు తనకూ వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాలు, సభలకు చివరి నిమిషంలో అనుమతులు నిరాకరిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.