Andhra Pradesh: అమరావతి భూములు చింతమనేని ప్రభాకర్ గొర్రెలు, పశువులు మేపుకోవడానికే పనికొస్తున్నాయి!: పార్థసారథి

  • వైఎస్ రుణమాఫితో టీడీపీ నేతలు లబ్ధి పొందారు
  • చంద్రబాబు సర్కారు కిరోసిన్ కూడా ఇవ్వడం లేదు
  • వంచనపై గర్జన సభలో వైసీపీ నేత పార్థసారథి

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కరుడుగట్టిన టీడీపీ నేతలకు కూడా రూ.15 లక్షలు రుణమాఫీ జరిగిందని వైసీపీ నేత పార్థసారథి తెలిపారు. అదే చంద్రబాబు నాయుడు పాలనలో ఊర్లలో పేదలకు తెల్ల రేషన్ కార్డులపై కిరోసిన్ ఇవ్వడానికి డబ్బులు లేవని ఎద్దేవా చేశారు. విజయవాడలో బోట్ రేసులు, ఎయిర్ షోలు నిర్వహించేందుకు మాత్రం సీఎం వద్ద నగదుకు కొరత లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి దౌర్భాగ్యపు పరిపాలన చేస్తూ సింగపూర్ కడతా.. పోలవరం కడతా.. అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. కాకినాడలో ఈ రోజు జరిగిన ‘వంచనపై గర్జన దీక్ష’లో పార్థసారథి మాట్లాడారు.

ఆంధ్రుల రాజధాని అమరావతిలో భూములన్నీ ఇప్పుడు బీడు భూములుగా మారాయని పార్థసారథి తెలిపారు. ఇప్పుడు రాజధానిలోని భూములు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పశువులు, గొర్రెలు మేపుకోవడానికి మాత్రమే పనికి వస్తున్నాయని ఎద్దేవా చేశారు. అంతకుమించి అక్కడ ఒక్కకట్టడం కూడా నిర్మించలేదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో అన్ని తాత్కాలిక భవనాలను చంద్రబాబు కట్టారని విమర్శించారు. వర్షం కురవగానే భారీగా నీరు చేరుతున్న సెక్రటేరియట్ కు చంద్రబాబు వందలకోట్లు చెల్లించారనీ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్నది చిన్నపిల్లవాడికి కూడా తెలుసనీ, దీనిపై జగన్ ప్రతీసారి పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News