Social Media: కోటి మందితో వాట్సాప్ గ్రూపులు రూపొందించాం: ఎంపీ కవిత
- కౌంటర్ ఇచ్చేందుకు చాలామంది ఉండేవారు
- సామాజిక మాధ్యమాల్లో యువత చాలా యాక్టివ్
- సోషల్ మీడియాను వ్యవస్థాగతంగా తీర్చిదిద్దాం
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రజలు చాలా యాక్టివ్ అయిపోయారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఛానల్స్‌లో వచ్చేలోపే సామాజిక మాధ్యమాల్లో వచ్చేస్తున్నాయి. దీనిని పార్టీలు కూడా బాగా వినియోగించుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వ్యవహారాలపై స్పందించారు.
ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యమ కాలంలో తెలంగాణపై ఏ వ్యతిరేక వార్త వచ్చినా కౌంటర్ ఇచ్చేందుకు అప్పట్లో చాలా మంది నెటిజన్లు సిద్ధంగా ఉండేవారని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ యువత చాలా యాక్టివ్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాను వ్యవస్థాగతంగా తీర్చిదిద్దామని కవిత తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అపోహలను తొలగించేలా కార్యక్రమాలు చేపడుతుంటామని తెలిపారు. దీని కోసం కోటిమందికి చేరేలా వాట్సాప్ గ్రూపులు రూపొందించినట్టు కవిత వెల్లడించారు.