West Bengal: పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు... గర్భిణితో వంద గుంజీలు తీయించిన వైనం!
- మహిళ గర్భస్రావానికి కారణమైన పెద్దల తీర్పు
- గర్భవతినన్నా వినిపించుకోకుండా గుంజీలు
- పోలీసులకు ఫిర్యాదు
పంచాయతీ పెద్దల తీర్పు ఓ మహిళ గర్భస్రావానికి కారణమైంది. విచక్షణ మరిచిన పెద్దల ఆటవిక తీర్పుతో మహిళ అనుభవించిన వేదన అంతా ఇంతా కాదు. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో జరిగిందీ అమానుష ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని సుతాహట్కు చెందిన మహిళ తమతో దురుసుగా ప్రవర్తించిందంటూ యువకులు కొందరు పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పెద్దలు మహిళను పిలిపించి మాట్లాడారు. యువకులతో ఆమె దురుసుగా ప్రవర్తించిన మాట నిజమేనని నిర్ధారించిన పెద్దలు వంద గుంజీలు తీయాలని ఆమెను ఆదేశించారు.
పెద్దల తీర్పుతో కన్నీరుమున్నీరైన మహిళ తాను గర్భవతినని, తనను వదిలేయాలని చేతులు జోడించి వేడుకుంది. అయినప్పటికీ చలించని ‘పెద్దలు’ గుంజీలు తీయాల్సిందేనని ఆదేశించారు. దీంతో పంటి కింద బాధను అనుభవిస్తూనే ఆమె గుంజీలు తీసింది. ఆ తర్వాతి రోజు ఆమె ఒక్కసారిగా అనారోగ్యం పాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను హల్దియాలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు గర్భస్రావం జరిగిందని చెప్పడంతో బాధిత మహిళ హతాశురాలైంది. అనంతరం హల్దియా పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన ఘోరాన్ని వివరించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.