Chandrababu: పోరాటానికి అందరూ సిద్ధంగా ఉండాలి.. ఎవరి ఒత్తిళ్లకు భయపడం: చంద్రబాబు
- టీడీపీకి కంచుకోట కూకట్ పల్లి
- నాడు కూకట్ పల్లిని ఎంతో అభివృద్ధి చేశాం
- హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా చేసింది టీడీపీయే
తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోరాటానికి అందరూ సిద్ధంగా ఉండాలని, ఎవరి ఒత్తిళ్లకు తాము భయపడే పరిస్థితి లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కూకట్ పల్లిలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, టీడీపీకి కంచుకోట కూకట్ పల్లి అని, ఒకప్పుడు కూకట్ పల్లిలో నీళ్లు కూడా వచ్చేవి కాదని, అటువంటి ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసింది తన హయాంలోనే అని అన్నారు.
‘నేను నా జీవితంలో చాలాసార్లు కూకట్ పల్లికి వచ్చాను కానీ, ఈరోజున మీరు చూపిస్తున్న ఉత్సాహం, ఆవేశాన్ని నేను చూడలేదు. ఎందుకు వచ్చారని నన్ను టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే వారి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అవునా? కాదా? తమ్ముళ్లూ’ అంటూ ఉత్సాహపరిచారు. యువత అంతా చాలా కసిగా ఉన్నారని, వీళ్లందరూ ఈరోజున ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారంటే అందుకు కారణం టీడీపీయేనని అన్నారు. ఈ విషయం నిజమే అయితే, గట్టిగా చప్పట్లు కొట్టాలని, ఆ చప్పట్లు కేసీఆర్ కు వినపడాలనడంతో కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.
హైదరాబాద్ లో నాలుగు బిల్డింగ్ లు కడితే అయిపోయిందా? అంటూ ఓ నాయకుడు తనపై విమర్శలు చేశారని, ప్రపంచ పటంలో హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా చేసింది టీడీపీయే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, సైబరాబాద్ ను అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ప్రపంచపటంలో పెట్టానని చంద్రబాబు బదులిచ్చారు. ఇందులో కేసీఆర్ పాత్ర ఏమైనా ఉందా? ఆయన ప్రమేయం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. నాడు తన పాలన తర్వాత అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో హైదరాబాద్ ఒక మహానగరంగా తయారైందని అన్నారు.