Srikakulam District: ముగింపు దశకు జగన్ పాదయాత్ర... పైలాన్ ఖరీదెంతో తెలుసా?
- ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర
- లోద్దపుట్టి తులసమ్మ గుడి ఎదురుగా పైలాన్
- రూ. 50 లక్షలతో నిర్మాణం
- శంకుస్థాపన చేసిన ధర్మాన, భూమా, తమ్మినేని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో నడుస్తున్న జగన్, మరికొద్ది రోజుల్లో ఇచ్ఛాపురంలో తన పాదయాత్రను ముగించనున్నారు. ఈ సందర్భంగా జగన్ పాదయాత్రకు గుర్తుగా ఓ పైలాన్ ను ఆవిష్కరించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రూ.50 లక్షలు వెచ్చించనున్నామని, వైకాపా సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు, భూమాన కరుణాకర్ రెడ్డి, తమ్మినేని సీతారాం వెల్లడించారు.
లొద్దపుట్టి ధనరాజ తులసమ్మ గుడి ఎదురుగా పైలాన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం, మీడియాతో మాట్లాడిన వారు, ఈ ప్రాంతానికి జగన్ చేరుకునే సరికి పైలాన్ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. పాదయాత్ర ముగింపు నాడు భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. స్తూపం నిర్మాణానికి పార్టీ సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి ఆర్థిక సాయం చేస్తున్నారని చెప్పిన ధర్మాన, ఈ సందర్భంగా ఆయన్ను అభినందించారు.