TJS: రాజకీయ బ్రోకర్లతో నిండిన ప్రజా కూటమి: రచనారెడ్డి తీవ్ర విమర్శలు
- టీజేఎస్ కు రాజీనామా చేసిన ఉపాధ్యక్షురాలు
- టికెట్లను అమ్ముకున్నారని విమర్శలు
- కోదండరామ్ ను చూసి ప్రజలు నవ్వుతున్నారన్న రచనారెడ్డి
తెలంగాణ జన సమితి (టీజేఎస్)కు షాకిస్తూ, రాజీనామా చేసిన ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనారెడ్డి, తీవ్ర విమర్శలు చేశారు. కోదండరామ్ పై నిప్పులు చెరిగిన ఆమె, ప్రజా కూటమి విషకూటమిగా మారిందని, ఇది టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాబోదని అన్నారు. కూటమి నిండా రాజకీయ బ్రోకర్లు నిండిపోయారని, టికెట్లను అమ్మకున్నారని విమర్శించారు. మరో రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి ప్రచారానికి రావడమే తప్పని వ్యాఖ్యానించిన ఆమె, చంద్రబాబు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.
కూటమి పేరిట రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించిన రచనా రెడ్డి, కూరగాయల మాదిరిగా అసెంబ్లీ సీట్లు అమ్ముకున్న ఘనత కూటమి నేతలదని అన్నారు. నమ్ముకున్న వారిని టీజేఎస్ నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాకూటమిలో సామాజిక న్యాయం లేదని, ఇప్పుడు కోదండరామ్ చేస్తున్న పనులను చూసి ప్రజలకు కోపం వస్తోందని అన్నారు. మైనారిటీలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. కూటమి ఏర్పడిన తరువాత చాలామంది నేతలు బలిపశువులు అయ్యారని రచనారెడ్డి వ్యాఖ్యానించారు.