Narendra Modi: ఈ దేశం మీదేనా? నాది కాదా?: అసదుద్దీన్ ఒవైసీ
- ఎంఐఎంను రాష్ట్రం నుంచి తరిమేస్తామన్న యోగి
- చరిత్ర తెలుసుకోవాలన్న ఒవైసీ
- తమకు అల్లా ఉన్నాడన్న ఎంఐఎం చీఫ్
ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్‌లపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మలక్‌పేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ఈ దేశం మీదేనా? నాది కాదా? అని ప్రశ్నించారు. వారి విధానాలను విమర్శిస్తే దేశం నుంచి తరిమేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రధాని మోదీ ఆలోచన కాదని, యోగి ఆలోచన అని పేర్కొన్నారు.
బీజేపీని ఓడించేందుకు తమకు అల్లా చాలని, తమకు ఆయన అండగా ఉన్నాడని పేర్కొన్నారు. మత రాజకీయాలకు బీజేపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఒవైసీ ఆరోపించారు. ర్యాలీల్లో అమిత్ షా అయితే తన గురించి, లేదంటే ఎంఐఎం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజాముల గురించి మాట్లాడే ముందు చరిత్రను తెలుసుకోవాలని యోగికి సూచించారు. తాము హైదరాబాద్‌ను వదిలి పారిపోబోమని, మోదీ, అమిత్ షా , అరెస్సెస్‌పై పోరాడతామని తేల్చి చెప్పారు.
హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన యూపీ సీఎం యోగి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ నుంచి నిజాం పారిపోయినట్టుగానే ఎంఐఎం నేతలు కూడా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయేలా చేస్తామని హెచ్చరించారు. యోగి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడిన అసుదుద్దీన్ పై వ్యాఖ్యలు చేశారు.