Black money: ఆ ‘నల్ల’ వీరుల వివరాలు అందిస్తామన్న స్విస్ ప్రభుత్వం
- భారత ప్రభుత్వ విజ్ఞప్తిని అంగీకరించిన స్విస్ ప్రభుత్వం
- రెండు కంపెనీలు, ముగ్గురు వ్యక్తుల వివరాలు ఇచ్చేందుకు సిద్ధం
- పాలనా పరమైన సాయం అందిస్తామని స్పష్టీకరణ
మోదీ ప్రభుత్వానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. భారత్లో అక్రమాలకు పాల్పడిన స్విస్ బ్యాంకు ఖాతాదారుల వివరాలను అందించేందుకు స్విస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. రెండు కంపెనీలు, ముగ్గురు వ్యక్తుల వివరాలు అందించనున్నట్టు తెలిపింది. తమిళనాడులోని జియోడెసిక్ లిమిటెడ్, ఆది ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, జియో డెసిక్ కంపెనీ చైర్మన్ పంకజ్ కుమార్ ఓంకార్ శ్రీవాస్తవ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ శరద్ ములేకర్, ఎండీ కిరణ్ కులకర్ణిలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని, వారి వివరాలు కావాలని భారత ప్రభుత్వం స్విస్ ప్రభుత్వాన్ని కోరింది.
భారత విజ్ఞప్తిని అంగీకరించిన స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆ వివరాలను అందిస్తామని, వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా పాలనా పరమైన సాయాన్ని భారత్కు అందజేస్తామని స్పష్టం చేసింది. 1982లో ఏర్పాటైన జియోడెసిక్, 2014లో ఏర్పాటైన ఆది ఎంటర్ప్రైజెస్లు ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయా కంపెనీల ప్రమోటర్ల ఆస్తులపై దాడులు చేశారు.