Jammu And Kashmir: తల్లిదండ్రుల కన్నీరుతో కరిగిన ఉగ్రవాది గుండె.. ఇంటికి చేరుకున్న కశ్మీర్ విద్యార్థి!
- జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో ఘటన
- ఇటీవల ఐఎస్ లో చేరిన బిలాల్
- తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో వెనక్కు
జమ్మూకశ్మీర్ లో యువకులను తప్పుదోవ పట్టించడంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు విజయం సాధిస్తున్నాయి. చాలామంది విద్యావంతులైన యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉగ్రవాదులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, స్నేహితుల విజ్ఞప్తులను సైతం వీరు పట్టించుకోవడం లేదు. కానీ కశ్మీర్ లోని శ్రీనగర్ లో మాత్రం భిన్నమైన ఘటన చోటుచేసుకుంది.
శ్రీనగర్ లోని ఖనియార్కు చెందిన ఎహతేషాం బిలాల్ సోఫీ (20) ఇటీవల నిషేధిత ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. నోయిడాలో ఇంజనీరింగ్ చదువుకున్న కుమారుడు కనిపించకపోయేసరికి అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే ఇస్లామిక్ స్టేట్ జెండాతో తుపాకీని పట్టుకుని నలుపురంగు దుస్తులతో బిలాల్ దర్శనమిచ్చాడు. దీంతో తమ వంశంలో బిలాల్ ఒక్కడే కుమారుడనీ, అతడిని విడిచిపెట్టాలని ఉగ్రవాదులకు అతని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
తల్లిదండ్రుల విజ్ఞప్తితో పాటు పోలీసులు చేసిన ప్రయత్నాలతో బిలాల్ నిన్న రాత్రి ఇంటికి తిరిగివచ్చాడు. దీంతో బిలాల్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కాగా, బిలాల్ ఇంటికి చేరుకోగానే పోలీసులు వైద్య పరీక్షలతో పాటు విచారణ కోసం అతడిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కాగా, బిలాల్ ను తాము అరెస్ట్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.