Telangana: చంద్రబాబు అడ్డుపడకుంటే 18 ఏళ్ల క్రితమే ప్రత్యేక తెలంగాణ వచ్చేది!: హరీశ్ రావు
- సీపీఐ, టీజేఎస్ కుడితిలో పడ్డ ఎలుకలు
- చంద్రబాబు నైజాన్ని అద్వానీ, యశ్వంత్ సిన్హా బయటపెట్టారు
- తెలంగాణ భవన్ లో హరీశ్ మీడియా సమావేశం
తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు కేసీఆర్ కు పోటీగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగిలారని టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి హరీశ్ రావు తెలిపారు. మహాకూటమి(ప్రజా కూటమి)లో తెలంగాణ జనసమితి, సీపీఐ ఉన్నప్పటికీ వారికి ఎలాంటి విలువలేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీల నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకగా తయారయిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడకుంటే తెలంగాణ 18 సంవత్సరాల క్రితమే ఏర్పాటు అయ్యేదని హరీశ్ రావు ఆరోపించారు. 1996లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు పేరుతో బీజేపీ కాకినాడలో తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న బీజేపీ తెలంగాణ ఏర్పాటు చేయాలనుకున్నా చంద్రబాబు అడ్డుపడ్డారని విమర్శించారు.
చంద్రబాబు ఒప్పుకోకపోవడంతోనే తాము తెలంగాణ ఇవ్వలేకపోతున్నట్లు 2009, ఫిబ్రవరి 5న విజయవాడలో మాజీ ఉపప్రధాని ఎల్.కె.అద్వానీ చెప్పారన్నారు. ఇదే అంశాన్ని మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కూడా ధ్రువీకరించారన్నారు. అలాంటి వ్యక్తితో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందని దుయ్యబట్టారు.