Hyderabad: టీఆర్ఎస్, మజ్లిస్ ల కబంధ హస్తాల్లో హైదరాబాద్ కూరుకుపోయింది: బీజేపీ నేత లక్ష్మణ్

  • టీఆర్ఎస్ పాలన ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఉంది
  • ప్రజలను మభ్యపెట్టడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదు
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఓ కుటుంబం కోసమా?

ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో దిగిన మోదీకి పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి బీజేపీ బహిరంగ సభ జరుగుతున్న ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. ఈ సభలో టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఆ పార్టీ నేతలు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణలో నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఉందని విమర్శించారు. హైదరాబాద్ ను అద్భుతంగా చేస్తామని చెప్పిన కేసీఆర్, ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఓ కుటుంబం కోసం అన్నట్టుగా ఉందని, ఉద్యమ పార్టీ అని ప్రజలు నమ్మి, టీఆర్ఎస్ కు ప్రజలు అవకాశమిస్తే వారి ఆశలను వమ్ము చేసిందని, అరచేతిలో వైకుంఠం చూపిందని మండిపడ్డారు.

హైదరాబాద్ లో గుంతలేని రోడ్డు ఒక్కటైనా చూపిస్తే, వెయ్యి రూపాయలు చొప్పున తాను ఇస్తానని అన్నారు. హైదరాబాద్ టీఆర్ఎస్, మజ్లిస్ ల కబంధ హస్తాల్తో కూరుకుపోయిందని, ఒవైసీ సోదరులు చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ ను  వారి కబంధ హస్తాల నుంచి కాపాడాలంటే తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

కేసీఆర్ అంటే ఆరు, ఆయన లక్కీ నెంబరు 6.. ప్రాజెక్టుల్లో కేసీఆర్ కు కమీషన్ 6 శాతం అని, ఈ కమీషన్ ప్రభుత్వం పోవాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని లక్ష్మణ్ కోరారు. ఈ సందర్భంగా ప్రజాకూటమి పై ఆయన నిప్పులు చెరిగారు. ప్రజాకూటమి అంటే ఒక విషకూటమి అని అన్నారు.

  • Loading...

More Telugu News