modi: ఒక్క బీజేపీ తప్ప ‘తెలంగాణ’లో పోటీ చేస్తున్నవన్నీ కుటుంబ పార్టీలే: ప్రధాని మోదీ
- దేశంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా గొంతెత్తాలి
- కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
- ఒక్క ఓటుతో కుటుంబ, వంశ, వర్గ పార్టీలను ఖతం చేయాలి
ఒక్క బీజేపీ తప్ప తెలంగాణలో పోటీ చేస్తున్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, దేశంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా గొంతెత్తాలని, కుటుంబ పార్టీలు ప్రజాస్వామానికి ప్రమాదకరమని, ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చిన ఒకే ఒక్క పార్టీ బీజేపీ అని అన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీ పెట్టారని, ఇప్పుడు, ఆ పార్టీని, చంద్రబాబు తన స్వార్థం కోసం ‘కాంగ్రెస్’ ముందు మోకరిల్లేలా చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా ఎంఐఎం గురించి కూడా ప్రస్తావించారు. ఈ పార్టీ కూడా కుటుంబ పాలన నుంచి వచ్చిందని, వారసత్వంతో పాటు మతాన్ని కూడా ఈ పార్టీ నమ్ముకుందని అన్నారు.
ఒక్క ఓటుతో కుటుంబ, వంశ, వర్గ పార్టీలను ఖతం చేయాలని మోదీ పిలుపు నిచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని, కర్ణాటకలో జేడీఎస్ ను బీజేపీ ‘బీ’ టీమ్ అని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల తర్వాత జేడీఎస్ తో కలిసిపోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలని, కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో మొదలైన విషయాన్ని ప్రస్తావించారు.
కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం అధికారం చలాయిస్తుందా? లేదా? ఇది ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడం కాదా? అని మోదీ ప్రశ్నించారు. టీఆర్ఎస్ కుటుంబ అధికారం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం కాదా? అని ప్రశ్నించిన మోదీ, కాంగ్రెస్, టీడీపీ, మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని విమర్శించారు.