HySis: గత వారం అంతరిక్షంలోకి వెళ్లిన 'హైసిస్' పంపిన తొలి చిత్రం ఇదిగో!
- నవంబర్ 29న నింగిలోకి హైసిస్
- గుజరాత్, లఖ్ పేట్ పరిసరాల ఫోటో
- చాలా స్పష్టంగా ఉందన్న ఇస్రో
గత నెల 29న భారత అంతరిక్ష సంస్థ నింగిలోకి పంపిన భూ ఉపరితల పర్యవేక్షణ ఉపగ్రహం 'హైసిస్' తాను తీసిన తొలి చిత్రాన్ని పంపించింది. దీంతో సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ - సీ43 ద్వారా నింగిలోకి చేరిన 'హైసిస్' తన తొలి అడుగును విజయవంతంగా వేసినట్లయింది.
ఈ శాటిలైట్ గుజరాత్ లోని లఖ్ పేట్ పరిసరాలను చిత్రీకరించింది. ఈ చిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. ఉపగ్రహం పంపే చిత్రాలతో వ్యవసాయం, నేలసార పరీక్షలు, పర్యావరణ నియంత్రణ తదితరాలకు సంబంధించి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేసే కృషికి ఎంతో సహకారం లభిస్తుందని పేర్కొంది. ఈ చిత్రం చాలా క్లారిటీతో ఉందని పేర్కొంది. కాగా, ఈ శాటిలైట్, భూ ఉపరితలంపై ఉన్న పరారుణ, విద్యుదయస్కాంత వలయాన్ని కూడా ఛేదించి చిత్రాలు తీయగలదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.