Pranoy Rai: ఆ 2 శాతం ఓట్లే కీలకం... తెలంగాణపై ప్రణయ్ రాయ్ ఆసక్తికర విశ్లేషణ!
- టీఆర్ఎస్, కూటమి మధ్య తీవ్రమైన పోటీ
- గత ఎన్నికల్లో మాదిరే పోలింగ్ జరిగితే అధికారం కూటమిదే
- ప్రణయ్ రాయ్ విశ్లేషణ
తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2 శాతం ఓట్లు అటూ, ఇటూ మారడం వల్ల గెలుపోటములు ప్రభావితం కానున్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రణయ్ రాయ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషించిన ఆయన అధికారంలోని టీఆర్ఎస్, జట్టుకట్టిన టీడీపీ - కాంగ్రెస్ కూటమి మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండనుందని అన్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 33 శాతం, కాంగ్రెస్ కు 24 శాతం, టీడీపీకి 14 శాతం, బీజేపీకి 7 శాతం, వైసీపీకి 3 శాతం, ఇతరులకు 11 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేసిన ఆయన, గత ఎన్నికల్లో ఎవరికి ఓటేసిన వారు, ఇప్పుడు కూడా వారికే ఓటు వేస్తే, కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని చెప్పారు. గత ఎన్నికల్లో మూడు పెద్ద పార్టీలు ఓట్లను చీల్చుకోవడం వల్ల టీఆర్ఎస్ సులువుగా అధికారాన్ని పొందిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం గులాబీ శ్రేణుల్లో ఆందోళనను పెంచే అంశమేనని ఆయన అన్నారు.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వచ్చిన 33 శాతం ఓట్లతో 63 సీట్లు గెలుచుకుందని, కాంగ్రెస్, సీపీఐ కూటమి 25 శాతం ఓట్లతో 22 సీట్లను, టీడీపీ, బీజేపీ కూటమి 21 శాతం ఓట్లతో 20 సీట్లను గెలుచుకున్నాయని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన 38 శాతం ఓట్లు కొనసాగితే అధికారం ప్రజా కూటమిదేనని ఆయన అంచనా వేశారు. ఇదే సమయంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పడ్డ టీడీపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఇప్పుడు టీఆర్ఎస్ వైపు మొగ్గినా, ఆ పార్టీకి 36 శాతానికి మించి ఓట్లు రావని, ఈ రెండు శాతం ఓట్ల తేడా అధికారాన్ని మార్చేస్తుందని అన్నారు.
రాష్ట్ర జనాభాలో 40 నుంచి 45 శాతం వరకూ ఉన్న ఓబీసీల ఓట్లు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్నాయని విశ్లేషించిన ప్రణయ్ రాయ్, వారి ఓట్లను రాబట్టుకునేందుకు అన్ని పార్టీలూ భారీ ఎత్తున వరాల జల్లు కురిపించాయని అన్నారు. ఇదే సమయంలో పట్టణ ప్రాంత ఓటర్లూ అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. ఇక, ఆందోల్ నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే గత 30 ఏళ్లుగా తెలంగాణలో అధికారాన్ని చేపడుతున్నదన్న ఆసక్తికర విషయాన్నీ ప్రణయ్ రాయ్ గుర్తు చేశారు. దీంతో పాటు గడచిన 11 ఏళ్లలో (మూడు ఎన్నికలు) మంధని, బోధన్, నరసాపూర్, వరంగల్ ఈస్ట్, జనగామ, షాద్ నగర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీలే అధికారాన్ని పొందాయని అన్నారు.