Uttam Kumar Reddy: సభ ఫ్లాప్ అవుతుందనే భయంతోనే అరెస్ట్ చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్
- కేసీఆర్ అరాచక పాలనకు ఇదొక నిదర్శనం
- అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి రేవంత్ ను అరెస్ట్ చేయడం దారుణం
- ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది
కొడంగల్ ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కోస్గి బహిరంగసభ ఫ్లాప్ అవుతుందనే భయంతోనే రేవంత్ ను అరెస్ట్ చేశారని అన్నారు. కేసీఆర్ అరాచక పాలనకు ఇదొక నిదర్శనమని చెప్పారు. అర్ధరాత్రి పూట తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు.
ఇలాంటి దుర్మార్గపు ఎత్తుగడలతో ప్రజలను ఆకట్టుకోలేరని చెప్పారు. ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఫిర్యాదులను సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం... తాము ఇచ్చిన ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం నేర్పుతారని అన్నారు.