Telangana: రేవంత్ రెడ్డి భార్య గీతకు కాంగ్రెస్ హైకమాండ్ ఫోన్!
- తెల్లవారుజామున రేవంత్ అరెస్ట్
- గుర్తుతెలియని ప్రాంతానికి తరలింపు
- నేడు కొడంగల్ లోని కోస్గీలో కేసీఆర్ సభ
తెలంగాణలోని కొడంగల్ లో ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సభను అడ్డుకుంటామని ప్రకటించిన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో రేవంత్ ఇంటిలోకి ప్రవేశించిన పోలీసులు, ఆయన్ను బలవంతంగా తీసుకెళ్లారు. అంతేకాకుండా రేవంత్ సోదరులతో పాటు 10 మంది ముఖ్య అనుచరులను అరెస్ట్ చేసి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. కాగా, రేవంత్ రెడ్డిని జడ్చర్ల పోలీస్ శిక్షణా కేంద్రానికి తరలించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఎలాంటి స్పష్టతా రావడం లేదు.
మరోవైపు తన భర్తను అర్ధరాత్రి ఉగ్రవాదిలా ఈడ్చుకెళ్లారని రేవంత్ రెడ్డి భార్య గీత ఆరోపించారు. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదని వాపోయారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాగా, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ గీతకు ఫోన్ చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్, తదనంతర పరిణామాలపై మాట్లాడారు. ధైర్యంగా ఉండాలనీ, కాంగ్రెస్ పార్టీ రేవంత్ కు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ కూడా రేవంత్ రెడ్డి భార్య గీతా రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు.