Mayawati: చంద్రబాబుకు చెయ్యివ్వనున్న మాయావతి... విపక్షాల సమావేశానికి డుమ్మా!
- విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాల్లో చంద్రబాబు
- ఇప్పటికే పలు పార్టీల నేతలతో చర్చలు
- ఎన్నికల ఫలితాలను చూసి నిర్ణయం తీసుకోనున్న మాయావతి
కేంద్రంలోని అధికార ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్న చంద్రబాబుకు ఇది ఓ రకంగా ఎదురుదెబ్బే. ఉత్తరప్రదేశ్ నేత, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఈ నెల 19న న్యూఢిల్లీలో తలపెట్టిన రాజకీయ పార్టీల సమావేశానికి హాజరు కాబోవడం లేదని తెలుస్తోంది. 2019లో విపక్షాలన్నీ జట్టుగా ఉంటే మాత్రమే బీజేపీని, నరేంద్ర మోదీని నిలువరించగలమన్న భావనలో ఉన్న చంద్రబాబు, ఇప్పటికే పలు పార్టీల అధినేతలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు 7వ తేదీతో ముగియనుండటంతో ఆపై మూడు రోజుల తరువాత అంటే, 10న న్యూఢిల్లీలో సమావేశమై, తదుపరి కార్యాచరణపై చర్చించాలని విపక్షాలు నిర్ణయించాయి.
చంద్రబాబు చొరవతో ఈ సమావేశానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ లతో పాటు సమాజ్ వాదీ తదితర ప్రధాన పార్టీలన్నీ హాజరవుతామని ఇప్పటికే స్పష్టం చేశాయి. కాగా, ఈ సమావేశం 10న పెట్టుకోవడం కంటే, 11న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత పెట్టుకుంటే బాగుంటుందన్నది మాయావతి అభిప్రాయమట.
ఇదే విషయాన్ని వెల్లడించిన ఆ పార్టీ నేత ఒకరు, 10న సమావేశానికి మాయావతి హాజరు కాబోవడం లేదని తెలిపారు. కాగా, ఈ సమావేశానికి రాబోమని డీఎంకే, ఆర్జేడీ తదితర పార్టీలు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కూటమిపై చర్చించేందుకు మరింత సమయం ఉందన్నది ఈ పార్టీల అభిప్రాయం.