Revanth Reddy: రేవంత్ అరెస్ట్ పై జిల్లా ఎస్పీ స్పందన
- కేసీఆర్ సభను అడ్డుకుంటామని రేవంత్ పిలుపునిచ్చారు
- ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశాం
- సభ ముగిసిన వెంటనే విడుదల చేస్తాం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ఎన్నికల సంఘం, పోలీసుల చర్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ నివాసం ఎదుట, జడ్చర్లలోని పోలీస్ బెటాలియన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
మరోవైపు, ఈ ఘటనపై వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యక్రమం సందర్భంగా అలజడి చెలరేగకుండా చూసేందుకే ముందస్తు చర్యల్లో భాగంగా రేవంత్ ను అరెస్ట్ చేశామని ఆమె తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నామని, ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. కేసీఆర్ సభను అడ్డుకుంటామంటూ రేవంత్ పిలుపునిచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి సభ ముగిసిన వెంటనే వారిని విడిచిపెడతామని చెప్పారు.