KCR: కేసీఆర్.. మీ కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా ఎందుకు చోటివ్వలేదు?: నందమూరి బాలకృష్ణ
- కేసీఆర్ పెత్తందారి వ్యవస్థను తీసుకొచ్చారు
- రైతుల ఆత్మహత్యల్లో టాప్ గా నిలిపారు
- ఓల్డ్ బోయిన్ పల్లి రోడ్ షోలో బాలకృష్ణ
కార్మికుల స్వేదం నుంచి, రైతుల కండరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. బంగారు తెలంగాణను తీసుకొచ్చేందుకు ప్రజలు కేసీఆర్ కు అధికారం అప్పగిస్తే ఆయనేమో పెత్తందారి వ్యవస్థను తీసుకొచ్చారని విమర్శించారు. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హమీలను నిలబెట్టుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్నారు. ఓల్డ్ బోయిన్ పల్లిలో ఈరోజు నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడారు.
తెలంగాణ కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా కేసీఆర్ స్థానం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చని నేతలు పలువురు టీడీపీలో చేరారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం మైనారిటీలకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేసిందని బాలకృష్ణ చెప్పారు.
మైనారిటీల కోసం టీడీపీ ప్రభుత్వమే తొలిసారి ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందనీ, ఆదుకుందని తెలిపారు. కానీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారనీ, కానీ ఇచ్చిన హామీని పూర్తిచేయలేదని మండిపడ్డారు. కూకట్ పల్లి మహాకూటమి(ప్రజా కూటమి) అభ్యర్థిగా పోటీచేస్తున్న నందమూరి సుహాసినికి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ అభివృద్ధి మహాకూటమితోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.