Telangana: తెలంగాణ ఎన్నికల్లో గెలిచే మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన లగడపాటి
- ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి
- మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి
- బెల్లంపల్లి నుంచి జి.వినోద్ గెలుస్తారు
ప్రతి ఎన్నికలప్పుడు కూడా పార్టీలకు అతీతంగా తాను సర్వే నిర్వహిస్తున్నానని, ఇలా సర్వేలు నిర్వహించడం తన అలవాటని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ ఎన్నికలు మరో మూడు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సర్వేలోని పాక్షిక వివరాలను వెల్లడించారు.
ఈ ఎన్నికలు ఆసక్తిగా మారిన తరుణంలో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించే వాడినని, ప్రస్తుతం తనకు ఏ పార్టీతోనూ, ఎవరితోనూ సంబంధం లేదని, 2009, 2014 ఎన్నికల్లో తాను చెప్పింది నిజమైందని అన్నారు.
ఈ ఎన్నికల్లో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారని మొన్న చెప్పానని, ఇప్పుడు మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను చెబుతానని అన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ రెబెల్ మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి , బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థి జి.వినోద్ గెలుస్తారని తన సర్వేలో వెల్లడైనట్లు చెప్పారు.
ఎనిమిది నుంచి పదిమంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని, ఈ ఎన్నికల్లో గెలిచే మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లను రేపు వెల్లడిస్తానని అన్నారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పూర్తి సర్వే ఫలితాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.