Hyderabad: ప్రస్తుతం ప్రజానాడి ‘కాంగ్రెస్’ వైపు ఉంది.. హైదరాబాద్ లో ఎక్కువ స్థానాలు ఎంఐఎంకే: లగడపాటి సర్వే
- ఎంఐఎం తర్వాత బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్
- ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డిలో కాంగ్రెస్
- వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్
- కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పోటాపోటీ
హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో ఎంఐఎం, ఆ తర్వాత బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గెలుస్తాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో పాక్షిక వివరాలను వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటుందని, వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ కు ఆధిక్యత లభిస్తుందని, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని లగడపాటి అభిప్రాయపడ్డారు.
అయితే, గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగితే అంచనాలు తారుమారు కావచ్చన్న విషయాన్ని గమనించాలని కోరారు. ప్రస్తుతం ప్రజానాడి కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని, విభజన తర్వాత ప్రజల మధ్య ఎలాంటి రాగద్వేషాలు లేవని అన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గాను వంద నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని, ఒక్కో నియోజకవర్గంలో 1000 నుంచి 1200 నమూనాలు తీసుకున్నామని, అన్ని సామాజిక వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించామని చెప్పారు.