TRS: ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయవద్దని హెచ్చరించా.. కానీ రేవంత్, జగ్గారెడ్డి విషయంలో అదే చేశారు!: లగడపాటి
- అనవసరంగా ప్రతిపక్షాల మైలేజ్ పెంచారు
- రెండో సర్వేలో టీఆర్ఎస్ 70 సీట్లు గెలుస్తుందన్నా
- నన్ను అనవసరంగా లక్ష్యంగా చేసుకున్నారు
ప్రతిపక్షాలపై పోలీసులను ప్రయోగించవద్దనీ, అరెస్ట్ చేయవద్దని తాను కేటీఆర్ ను హెచ్చరించానని పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి వంటివారిని అనవసరంగా అరెస్ట్ చేశారని అన్నారు.
‘ఇలాంటి పనులతో మీ నాన్న కేసీఆర్ కు ఇప్పటికే చెడ్డపేరు వచ్చింది. నువ్వు దాన్ని సరిదిద్దుతున్నావ్’ అని కేటీఆర్ ను తాను ప్రశంసించానని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతల అరెస్టుతో వాళ్లకు అనవసరంగా పొలిటికల్ మైలేజీ కల్పించినవారు అవుతారని సూచించానన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో లగడపాటి మాట్లాడారు.
కేటీఆర్ కు తాను మంచి సూచనలే చేశానన్నారు. దీంతో చివరకు తనకు కేటీఆర్ ‘థ్యాంక్స్’ అని సందేశం పంపారన్నారు. మహాకూటమి సీట్ల పంపిణీ కోసం కొట్టుకుంటున్న తరుణంలో మరో సర్వే చేశామన్నారు. ఇందులో టీఆర్ఎస్ కు 70 స్థానాలు, మహాకూటమి నేతలకు 35-40 స్థానాలు వస్తాయని తేలిందన్నారు. ఈ విషయాన్నే కేటీఆర్ కు నవంబర్ 20న పంపానని గుర్తుచేసుకున్నారు.
అయితే ఈ సర్వే ఫలితాలతోనూ ఆయన సంతృప్తి చెందలేదనీ..‘రాజగోపాల్.. ఆ సర్వేలో చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లను మేం సాధిస్తాం. మీకు సర్ ప్రైజ్ ఇస్తాం’ అంటూ చెప్పారన్నారు. తాను కేటీఆర్ ను ఛాలెంజ్ చేయలేదనీ, మంచి కోసం, సాయం కోసం పంపించానని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోననీ, మీ టాలెంట్ ఏంటో నాకు తెలుసని కేటీఆర్ తో చెప్పానన్నారు.
ఆ తర్వాత ఇప్పటివరకూ తనకు ఎన్ని నివేదికలు వచ్చినా బయట పెట్టలేదని తెలిపారు. మీడియా సభ్యులు కోరడంతో తిరుపతిలో తాను కేవలం 8-10 స్వతంత్ర అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని మాత్రమే చెప్పానన్నారు. తాను ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకపోయినా తనను లక్ష్యంగా చేసుకుని కొందరు రాజకీయ మిత్రులు విమర్శలకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు.