Andhra Pradesh: అధికారుల తీరుకి సరికొత్త నిరసన ... డ్రైనేజ్ కాలువలోకి దిగిన నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే!
- వినూత్నంగా నిరసన తెలిపిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- కాలువపై వంతెన కట్టాలంటూ స్థానికుల విజ్ఞప్తి
- పట్టించుకోని మున్సిపాలిటి అధికారులు
ప్రజలు పడుతున్న ఇబ్బందిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానికంగా చిన్న వంతెన నిర్మించాలని కోరుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో మురుగునీటి కాలువలోకి దిగిపోయారు. అధికారులు ఇక్కడ బ్రిడ్జిని నిర్మించేవరకూ తాను బయటకు రాబోనని స్పష్టం చేశారు. ఈ ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
నెల్లూరు పట్టణంలో ఉన్న ఓ వీధిలో మురుగు కాలువ మీదుగా చిన్న బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అధికారులతో మాట్లాడారు. కాలువలో ప్రవాహం ఎక్కువయినప్పుడు ప్రజలు దాటడానికి ఇబ్బంది పడుతున్నారనీ, చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో త్వరలోనే ఇక్కడ వంతెనను నిర్మిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారు. అయితే నెలలు గడిచిపోయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో సమస్యను ప్రజలు మరోసారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో ఆగ్రహానికి లోనైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డైరెక్టుగా వచ్చి కాలువలోకి దిగిపోయారు. వంతెన కట్టేవరకూ తాను ఇక్కడి నుంచి కదలబోనని స్పష్టం చేశారు. కాలువ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కోటంరెడ్డి కాలువలోకి దిగడంతో అక్కడకు భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో కొందరు సీనియర్ అధికారులు ఎమ్మెల్యే వద్దకు చేరుకుని చర్చలు జరిపారు.