Telangana: నాలుగు నెలల కష్టం ఒక్క పూటలో గంగపాలు... ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మనస్తాపం!
- అసెంబ్లీ రద్దయిన క్షణం నుంచి శ్రమించిన రజత్ కుమార్
- రేవంత్ అరెస్ట్ ను తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు, జాతీయ ఎన్నికల కమిషన్
- మందలింపులతో కలత చెందిన సీఈసీ
ముందస్తుకు వెళ్లాలన్న ఉద్దేశంతో కేసీఆర్, తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన క్షణం నుంచి, ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు నాలుగు నెలలుగా పడిన కష్టం, ఒక్క పూటలో విలువ లేకుండా పోయిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ మనస్తాపం చెందారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ ను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుబట్టడం, హైకోర్టు మందలించడంతో ఆయన కలత చెందారు.
ఈ ఘటన ఆయనకు తీవ్ర ఆగ్రహాన్ని సైతం తెప్పించిందని, ఆయనను కలిసేందుకు కార్యాలయ వర్గాలు సైతం భయపడుతున్నాయని తెలుస్తోంది. ఎన్నికల సంఘం పనితీరుపై హైకోర్టు న్యాయమూర్తులు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆయనకు మనస్తాపం కలిగించినట్టు తెలుస్తోంది.
కేసీఆర్ బహిరంగ సభను వ్యతిరేకించిన రేవంత్, బంద్ కు పిలుపునివ్వగా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా 'అవసరమైన చర్యలు' తీసుకోవాలని మాత్రమే తాను ఆదేశిస్తే, ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేయాలని ఎస్పీ అన్నపూర్ణ నిర్ణయం తీసుకున్నారని, దీంతో తనపై అపవాదులు వచ్చాయని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.
రేవంత్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లకుండా, గృహ నిర్బంధంలో ఉంచితే ఇంత వివాదం వచ్చుండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రజత్ కుమార్, గత రెండ్రోజులుగా విలేకరులను సైతం కలిసేందుకు ఇష్టపడకపోవడం గమనార్హం.