Hyderabad: ఓటేయడానికి గ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

  • హైదరాబాద్ నుంచి కారులో వెళ్తుండగా ప్రమాదం
  • విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
  • నల్గొండ జిల్లాలో ఘటన

శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద అడిశర్లపల్లి మండలం పోల్కంపల్లికి చెందిన పోగుల సురేందర్‌రెడ్డి(55), పోగుల యాదమ్మ(50) భార్యభర్తలు. ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వచ్చారు.

శుక్రవారం ఎన్నికలు జరగనుండడంతో ఓటు వేసేందుకు.. అల్లుడు వెంకట్‌రెడ్డి (35), స్నేహితుడు బొడ్డుపల్లి నర్సింహాచారి, వెంకటరెడ్డి అన్న కుమారుడు మహేందర్ రెడ్డితో కలిసి సురేందర్‌రెడ్డి, యాదమ్మలు కారులో స్వగ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యాతండా వద్ద అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, సురేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డిలు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. తీవ్రగాయాలపాలైన నర్సింహాచారి, మహేందర్‌రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News