Telangana: గుట్టల కొద్దీ నోట్ల కట్టలు... తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న డబ్బు!
- ఆఖరి ఘడియలకు పోల్ దంగల్
- ఓట్ల కొనుగోలుకు దిగిన అభ్యర్థులు
- కట్టడి చేసే ప్రయత్నాల్లో పోలీసులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార అంకానికి తెరపడిన వెంటనే ప్రలోభాలకు తెరలేచింది. నిన్న సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో భారీగా డబ్బు కట్టలను పోలీసులు పట్టుకున్నారు. పోల్ దంగల్ ఆఖరి ఘడియల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఉన్న అభ్యర్థులు, ఓట్ల కొనుగోలుకు దిగారు. పక్కా నిఘా పెట్టిన పోలీసులు, ఐటీ అధికారులు చాలా చోట్ల వారిని అడ్డుకున్నారు.
సికింద్రాబాద్ లో గత రాత్రి భారీగా డబ్బు పట్టుబడింది. చిలకలగూడ ప్రాంతంలో సోదాలు చేయగా, ఓ కారులో తరలిస్తున్న రూ. 3 కోట్ల నగదు దొరికింది. బంజారాహిల్స్ లో వాహనంలో తరలిస్తున్న రూ. 3.42 కోట్ల నగదు పోలీసులకు పట్టుబడింది. కూకట్ పల్లి, బాలాజీనగర్ లో కరెన్సీ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. నోట్ల కట్టలతో పారిపోతున్న ఇద్దరిని మరో పార్టీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
వరంగల్ అర్బన్ పరిధిలో ఫ్లయ్యింగ్ స్క్వాడ్ తనిఖీలు చేయగా, గోపాలరావు అనే వ్యక్తి ఇంట్లో రూ. 2 కోట్ల నగదు బయటపడింది. ఈ డబ్బుకు సరైన పత్రాలను చూపించడంలో ఆయన విఫలం కాగా, వాటిని ఐటీ అధికారులకు అప్పగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అదే జిల్లా ఆత్మకూరులో రూ. 40 లక్షలు దొరికాయి.
ఇక మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పేరాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఓటర్లకు డబ్బు పంచుతున్నారన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు, దాడులు చేయగా, రూ. 5.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంమీద గడచిన 24 రోజుల వ్యవధిలో రూ. 124 కోట్లకు పైగా నగదు, మద్యం, బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు అధికారులు.