voter slips: ఓటరు స్లిప్ అందలేదా...డోంట్ వర్రీ!: ‘నా ఓటు’, ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు!
- హైదరాబాద్ జిల్లాలో 40.6 లక్షల మంది ఓటర్లు
- చిరునామా సరిగా లేక, బీఎల్ఓలు గుర్తించక 6 లక్షల మందికి అందని చీటీలు
- ప్రత్యామ్నాయ యాప్‌ను వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి సూచన
ఓటర్లు గరిష్ట స్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్న ఎన్నికల సంఘం ఓటరు స్లిప్ విషయంలోనూ ప్రత్యేక అవకాశాలను సూచించింది. ఓటర్ స్లిప్‌లు అందని వారు ‘నా ఓటు’, ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ నుంచి ఎంచక్కా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఆయా యాప్‌ల్లోకి వెళ్లి పేరు, ఇతర వివరాలు నమోదు చేస్తే ఓటరు జాబితా ముద్రిత ఫారం వస్తుందని, అందులో మీ ఫొటో, ఇతర వివరాలతో ఉన్న ముద్రిత ఫారాన్ని ప్రింట్ తీయించుకుని ఓటు హక్కు వినియోగించుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్ తెలిపారు.
బీఎల్ఓలు గుర్తించలేకపోవడం, స్లిప్‌లో అడ్రస్ సరిగా లేకపోవడం వంటి కారణాలతో హైదరాబాద్ జిల్లాలోనే 15 శాతం మంది ఓటర్లకు స్లిప్‌లు అందలేదు. జిల్లాలో మొత్తం 40 లక్షల 57 వేల 488 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 6 లక్షల మందికి చీటీలు పంపిణీ చేయలేకపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఓటు ఒక చోట ఉండడం, నివాసం మరో చోటికి మారడం, ప్రాంతం గుర్తించలేకపోవడం వంటి కారణాలతో చీటీలు అందించలేకపోయారు. ఇటువంటి వారంతా తమ స్మార్ట్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓటరు స్లిప్ పొందవచ్చునని ఎన్నికల అధికారి సూచించారు.