ahdar: ఆధార్ చట్ట సవరణకు ప్రభుత్వం కసరత్తు.. సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో చర్యలు
- ప్రైవేటు సంస్థకు ఇచ్చిన వివరాల ఉపసంహరణపై న్యాయ శాఖకు ప్రతిపాదన
- కొన్ని వర్గాలకే కాకుండా ప్రజలందరికీ కల్పించాలని సూచన
- పాన్ కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానానికి ఓకే
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఆధార్ అనుసంధానం అంశంపై తీర్పు ఇచ్చిన మూడు నెలల తర్వాత చట్టపరమైన మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రైవేటు సంస్థలు ఆధార్ డేటాను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్న ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను కొట్టేయాలని గత సెప్టెంబర్లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులకు ఆధార్ అనుసంధానం రాజ్యాంగ విరుద్ధమని అప్పట్లో ధర్మాసనం పేర్కొంది. అయితే పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని ధర్మాసనం సమర్థించింది.
ఈ తీర్పును అనుసరించి ఆధార్ చట్టానికి సవరణలకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సవరణకు సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలను భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) రూపొందించింది. ఇంతకు ముందు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన వివరాల ఉపసంహరణకు ఆరు నెలలు గడువు ఇవ్వాలని కోరుతూ న్యాయశాఖ పరిశీలనకు దీనిని పంపింది. అయితే ఉపసంహరణ వెసులు బాటు కొన్ని వర్గాలకే పరిమితం చేయకుండా ప్రజలందరికీ అవకాశం కల్పించాలని సూచించిందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ సూచన మేరకు చట్ట సవరణ చేసి, పౌరులు ఇప్పటికే తామిచ్చిన ఆధార్ వివరాలను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.