Supreme Court: ఇవి ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం: రోడ్ల గుంతలపై సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు
- అసాంఘిక శక్తుల చేతుల్లో కంటే గోతుల్లో పడి చనిపోతున్న వారే ఎక్కువలా ఉంది
- రహదారుల నిర్వహణ గురించి ఏ మాత్రం పట్టించుకున్నట్లు లేదు
- రహదారి భద్రత నివేదికపై స్పందించాలని కేంద్రానికి ఆదేశం
‘రహదారులపై గుంతల కారణంగా జరిగిన ప్రమాదాల్లో గడచిన ఐదేళ్ల కాలంలో 14,926 మంది చనిపోవడం బాధాకరం, చూస్తే సరిహద్దులో ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన వారి కంటే ఈ సంఖ్య అధికంగా కనిపిస్తోంది. ఉగ్రవాదుల కంటే రోడ్ల గుంతలే ప్రమాదకరం అన్నమాట’ అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్ కమిటీ రహదారి భద్రతపై సమర్పించిన నివేదికపై విచారణ సందర్భంగా జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం 2013 నుంచి 2017 మధ్య చనిపోయిన వారి సంఖ్య చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. 'పరిస్థితి చూస్తుంటే రహదారుల నిర్వహణను ఏ మాత్రం పట్టించుకున్నట్లు అనిపించడం లేదు. ఇది ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదు' అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం ఈ నివేదికపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.