italy: నైట్ క్లబ్ లో పెప్పర్ స్ప్రే చల్లిన దుండగులు.. తొక్కిసలాటలో ఆరుగురి మృతి, 100 మందికి గాయాలు!
- ఇటలీలోని కోరినాల్టో పట్టణంలో ఘటన
- రాత్రి ఒంటి గంటకు తొక్కిసలాట
- కేసు నమోదు చేసిన ఇటలీ పోలీసులు
ఓ నైట్ క్లబ్ లో గుర్తుతెలియని వ్యక్తులు పెప్పర్ స్ప్రే చల్లడంతో భారీగా తొక్కిసలాట చెలరేగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, దాదాపు 100 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఇటలీలోని కోరినాల్టో పట్టణంలో చోటుచేసుకుంది. కోరినాల్టోని ఓ నైట్ క్లబ్ లో శుక్రవారం రాత్రి సెఫెరా ఎబ్బెస్టా అనే ర్యాపర్ కార్యక్రమం ప్రారంభమయింది. దీనికి వెయ్యి మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో క్లబ్ లో వెల్లుల్లి వంటి ఘాటు వాసన ఉన్న పెప్పర్ స్ప్రేను ఎవరో ప్రయోగించారు.
దీంతో నైట్ క్లబ్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఎగ్జిట్ డోర్ వైపు పరుగులు తీశారు. కానీ అక్కడే ఉన్న బౌన్సర్లు వీరిని అడ్డుకున్నారు. తమకు ఎలాంటి వాసన రావడం లేదనీ, వెనక్కు వెళ్లాలని సూచించారు. ఇంతలో వెనుక నుంచి వందలాది మంది ఒక్కసారిగా దూసుకురావడంతో గేట్ వద్ద ఉన్న ప్రజలు కింద పడిపోయారు.
చాలామంది వీరిని తొక్కుకుంటూ బయటకు పరుగులు తీయడంతో వందలాది మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మిగిలినవారిని స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఇటలీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.