USA: అమెరికా శాస్త్రవేత్తల అద్భుత సృష్టి.. కందిరీగ విషంతో శక్తిమంతమైన యాంటీ బయాటిక్ తయారీ!
- మొండి బ్యాక్టీరియాను తుదముట్టిస్తున్న మందు
- కణజాలాలకు ప్రమాదం లేదంటున్న నిపుణులు
- మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తల ఘనత
సాధారణంగా మన ఇళ్లలో, చుట్టుపక్కల కందిరీగల తుట్టెలు పెడితే వాటిని తీసేస్తుంటాం. అవి పురుగులను తెస్తాయనీ, కొన్నికొన్ని సార్లు మనల్ని కుడతాయని బాధపడిపోతుంటాం. కానీ ఆ కందిరీగలే తాజాగా మానవాళికి అద్భుతమైన బహుమతిని అందజేశాయి. ప్రస్తుతం ఉన్న యాంటీ బయాటిక్ మందులకు లొంగని బ్యాక్టీరియాను చంపగల శక్తిమంతమైన సరికొత్త యాంటీ బయాటిక్ ను కందిరీగల విషం నుంచి అమెరికా శాస్త్రవేత్తలు తయారుచేశారు. మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందని పరిశోధకులు ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేశారు.
దక్షిణ అమెరికా ప్రాంతంలో కనిపించే పౌలిబియా పౌలిస్టా జాతికి చెందిన కందిరీగ విషం నుంచి శాస్త్రవేత్తలు యాంటీ బయాటిక్ గా పనిచేసే పెప్టైడ్ లను అభివృద్ధి చేశారు. సాధారణంగా ఈ విషం మనుషుల ప్రాణాలను తీస్తుంది. అయితే పలు పరిశోధనల అనంతరం కేవలం బ్యాక్టీరియాను మాత్రమే చంపేలా శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. మానవ శరీరంలో శ్వాసకోశ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో పాటు ఇతర వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఈ పెప్టైడ్ 100 శాతం తుడిచిపెట్టేస్తుందని ఎంఐటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటి బయాటిక్ మందులకు లొంగని బ్యాక్టీరియా సైతం దీనిముందు దిగదుడుపేనని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ యాంటి బయాటిక్ పెప్టైడ్ ను తొలుత ఎలుకలపై ప్రయోగించగా, నాలుగు రోజుల్లో బ్యాక్టీరియా పూర్తిగా చనిపోయిందని తెలిపారు.