Balamma: తెలంగాణలో చివరి 'కిన్నెర' గాయని బాలమ్మ మృతి
- మూగబోయిన కిన్నెర వాయిద్యం
- కటిక దారిద్య్రాన్ని అనుభవించిన బాలమ్మ
- ఆదుకునేందుకు ముందుకు రాని ప్రభుత్వం
అట్టడుగు దళిత సామాజికవర్గంలో పుట్టి 15 ఏళ్ల వయసులోనే కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ జీవనాన్ని ప్రారంభించిన చిట్ట చివరి డక్కలి కిన్నెర గాయని బాలమ్మ 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భర్త మరణానంతరం కూడా వృత్తినే నమ్ముకున్న ఆమె ఊరూరూ తిరుగుతూ కిన్నెర వాయిద్యం ద్వారా కుటుంబాన్ని పోషించారు. ఒకప్పుడు గుర్రంపై కూర్చుని గ్రామాల్లో తిరుగుతూ కిన్నెర వాయిద్యాన్ని వాయించే బాలమ్మ కటిక పేదరికాన్ని అనుభవించారు. పది వీరగాథలను అలవోకగా పాడే ఆమె అందించే పన్నెండు కిన్నెర మెట్ల సంగీతం తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందింది.
కిన్నెర కళను నిలబెట్టాలన్న ఆలోచన లేని ప్రభుత్వాలు ఆమెను విస్మరించాయి. ప్రభుత్వం నుంచి ఆమెకు ఎటువంటి గుర్తింపు లభించలేదు. చివరికి సొంత ఇల్లు, ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు కూడా ఆమెకు లేదంటే ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన బాలమ్మ వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా మంచం పట్టారు. ఆమెను ఆదుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.
బాలమ్మ మృతి తెలంగాణ కళాకారులకు తీరని లోటని, తెలంగాణ ఓ గొప్ప కళాకారిణిని కోల్పోయిందని తెలంగాణ రచయితల వేదిక సంఘం అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు, పొట్లపల్లి ఫౌండేషన్ అధ్యక్షుడు పొట్లపల్లి వరప్రసాదరావు, పాలమూరు వర్సిటీ ప్రొఫెసర్ గూడూరు మనోజ తదితరులు పేర్కొన్నారు. బాలమ్మ మృతికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.