counting of veltes: హైదరాబాద్ జిల్లాలో తొలి ఫలితం చార్మినార్‌ది వెల్లడయ్యే అవకాశం
- పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి లెక్కింపు సమయం
- అత్యంత తక్కువ కేంద్రాలు ఉన్నది ఈ నియోజకవర్గంలోనే
- చివరిలో వెల్లడికానున్న యాకుత్‌పురా ఫలితం
తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాక తొలి ఫలితం హైదరాబాద్ జిల్లాలో చార్మినార్‌ది వెల్లడయ్యే అవకాశం ఉంది. సాధారణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఆయా నియోజకవర్గాల ఫలితం వెల్లడికి సమయం పడుతుంది. తక్కువ కేంద్రాలుంటే వేగంగా, ఎక్కువ ఉంటే ఆలస్యంగా ఫలితాలు వస్తాయి. ఆ విధంగా చూస్తే చార్మినార్ నియోజకవర్గంలో మొత్తం 198 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఫలితం త్వరగా వచ్చే వీలుంది. ఇక ఇదే జిల్లాలోని యాకుత్‌పురా నియోజకవర్గంలో 317 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఇక్కడి ఫలితం ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ లెక్కన మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాక మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. యాకుత్‌పురా ఫలితం వెల్లడయ్యే సరికి రెండు గంటలు దాటిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నమోదైన పోలింగ్ శాతం, బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఫలితాల ప్రకటన కాస్త అటూ ఇటుగా మారే అవకాశం ఉంది.