Andhra Pradesh: నాకు టీడీపీ నేతలు ఫోన్ చేస్తున్నారు.. సంపాదించుకోకుంటే ఓడిపోతాం అని చెబుతున్నారు!: ఉండవల్లి
- ఏపీ ప్రభుత్వంలో భారీ అవినీతి జరుగుతోంది
- రూ.20 కోట్లు పెడితే కాని ఎమ్మెల్యే కావట్లేదు
- సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో ఉండవల్లి వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భారీ అవినీతి చోటుచేసుకుంటోందని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ఆదరణ పథకం కింద రూ.లక్ష వ్యయంతో వీడియోకాన్ వాషింగ్ మెషీన్ ను కొంటోందని, అదే మెషీన్ మార్కెట్ లో మాత్రం రూ.75,000కే దొరుకుతోందని వ్యాఖ్యానించారు.
అలాగే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అన్న క్యాంటీన్లలో భోజనం పరిమాణంలో తేడా కొంచమే ఉన్నప్పటికీ ధరలు మాత్రం మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ బహిరంగ రహస్యాలేననీ, వీటిపై ఎవ్వరూ చర్చించడం లేదన్నారు. విశాఖపట్నం జిల్లాలో జనచైతన్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు’లో ఉండవల్లి మాట్లాడారు.
కాంట్రాక్టులు, ప్రాజెక్టుల ద్వారా సంపాదించుకున్నది చాలక ఇప్పుడు ఆదరణ, మధ్యాహ్న భోజనం వంటి పథకాల్లో అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఈ స్థాయిలో అవినీతికి పాల్పడిన ప్రభుత్వాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.
కొందరు టీడీపీ మిత్రులు ఈ విషయమై తనకు ఫోన్ చేసి..‘మమ్మల్ని ఏం చేయమంటావ్? ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుంటే గెలవలేని పరిస్థితి. ఇలా సంపాదించకపోతే కష్టం’ అంటూ చెబుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వ అవినీతిని కట్టడి చేసేందుకు యువత ముందుకు రావాలనీ, ఉత్తరాంధ్ర మేధావులు ఇందుకు సాయం చేస్తారని పేర్కొన్నారు.
ప్రస్తుత రాజకీయాలకు తాను సరిపోననీ, ఇప్పుడు నేతలందరూ సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. దేశంలో ఓటుకు వేలం పాట జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రూ.20 కోట్లు ఖర్చు పెడితే కానీ అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.