Andhra Pradesh: జగన్ దెబ్బకు గోల్డ్ మెడల్ సాధించిన ఐఏఎస్ లు జైలుకు వెళ్లాల్సివచ్చింది!: మంత్రి దేవినేని
- తండ్రి సాయంతో భారీ అవినీతికి పాల్పడ్డారు
- 16 నెలలు జైలులో ఉన్నా మార్పు రాలేదు
- తోటపల్లి ప్రాజెక్టుపై బోత్స,ధర్మానను ప్రశ్నించండి
తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ వేలాది కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకున్నారని టీడీపీ నేత, మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. అలాంటి జగన్ కు 2019లో అధికారం అప్పగిస్తే ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. 16 నెలలు జైలులో ఉన్నా జగన్ లో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ఏంపీలు రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. మోదీ డైరెక్షన్ లో జగన్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని ఉమామహేశ్వరరావుతో మాట్లాడారు.
వైఎస్ జగన్ అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే ఆయనకు చెందిన వేల కోట్ల రూపాయలను ఈడీ జప్తు చేసిందని ఉమ వ్యాఖ్యానించారు. ఏపీలో అన్ని పంటలకు నీరు అందిస్తున్న ఘనత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వానిదేనని కితాబిచ్చారు.13 అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ అవినీతిరహిత పాలన తెస్తాననడం దొంగే.. దొంగ..దొంగ.. అని అరిచినట్లు ఉందని ఎద్దేవా చేస్తారు.
జగన్ దెబ్బకు గోల్డ్ మెడల్ సాధించిన ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో తోటపల్లి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదో పక్కనే ఉన్న బొత్స సత్యనారాయణ, ధర్మన ప్రసాదరావును అడగాలని సూచించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఏపీ ప్రజలు మరోసారి అధికారం అప్పగించబోతున్నారని జోస్యం చెప్పారు.