Andhra Pradesh: ఓట్ల కోసం చంద్రబాబు బీసీలను బెదిరిస్తున్నారు.. పశ్చిమగోదావరిలో దాడికి పాల్పడ్డారు!: జంగా కృష్ణమూర్తి

  • నాలుగున్నరేళ్లలో బీసీలకు ఒక్కఇల్లూ కట్టలేదు
  • జగన్ కమిటీ వేయగానే ఆగమేఘాల మీద స్పందించారు
  • చంద్రబాబును బీసీలు గమనిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లో బీసీలను బెదిరించి ఓట్లు దక్కించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు యత్నిస్తున్నారని వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. ఇందులో భాగంగానే పశ్చిమగోదావరి జిల్లాలో సభ్యత్వ నమోదు సందర్భంగా బీసీలపై దాడిచేశారని విమర్శించారు. ఎన్నికలు సమీపించేవరకూ చంద్రబాబుకు బీసీల సమస్యలు గుర్తుకు రాలేదని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ బీసీల సమస్యలపై కమిటీ వేయగానే చంద్రబాబు హుటాహుటిన స్పందించారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని జంగా కృష్ణమూర్తి విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న పనులను బీసీలు గమనిస్తున్నారనీ, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి గట్టిగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 20 నుంచి ఏపీ అంతటా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.  2019 ఏపీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. అధికారంలోకి రాగానే రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామనీ, భారీ సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News