Telangana: నేడు గవర్నర్ను కలవనున్న ప్రజాకూటమి.. తమది ఒకే జట్టుగా గుర్తించాలని కోరనున్న నేతలు!
- ఆదివారం సమావేశమైన కూటమి ముఖ్య నేతలు
- ఫలితాల అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
- రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవాలంటూ వినతిపత్రం
మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రజాకూటమి ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది. అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైంది. ఇందులో భాగంగా గవర్నర్ను కలిసి ప్రజాకూటమి మొత్తాన్ని ఒకే జట్టుగా గుర్తించాలని విన్నవించనుంది. శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐలు కలిసి పోటీ చేశాయని, కాబట్టి తమను ఒక్కటిగానే గుర్తించి, తొలి ప్రాధాన్యం తమకే ఇవ్వాలని గవర్నర్కు విన్నవించాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఫలితాల అనంతరం రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ నేడు కూటమి ముఖ్య నేతలు గవర్నర్ను కలవనున్నారు.
ఫలితాల అనంతరం తాము టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వబోతున్నట్టు బీజేపీ ప్రకటించడంతో అప్రమత్తమైన కూటమి నేతలు ఆదివారం సమావేశమయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కుంతియా, ఎల్.రమణ, కోదండరాం, రేవంత్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, అజారుద్దీన్, కుసుమకుమార్, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి తదితర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. తుది ఫలితాలు వెల్లడయ్యాక తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
కూటమి తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలతో మంగళవారమే హైదరాబాద్లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో మూడు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలతోపాటు, అర్ధరాత్రి రేవంత్ రెడ్డి ఇంటి తలుపులు బద్దలుగొట్టి అరెస్ట్ చేయడం, పోలింగ్ రోజున వంశీచంద్పై దాడి వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఎల్.రమణ తెలిపారు.