Anantapur District: టీడీపీ రెబెల్ నేత అబ్దుల్ ఘనీకి కీలక బాధ్యతలు అప్పగించిన జగన్!
- ఇటీవల వైసీపీలో చేరిన అబ్దుల్ ఘనీ
- చంద్రబాబు మైనారిటీలను పట్టించుకోలేదని ఆరోపణ
- బాలయ్య కోసం 2014లో సీటు త్యాగం
హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అబ్దుల్ ఘనీ ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో ఘనీ తన అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మైనారిటీలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని ఘనీ ఆరోపించారు.
ఈ క్రమంలో హిందూపురం టికెట్ విషయమై స్పష్టమైన హామీ రావడంతోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా అందుకు బలం చేకూరుస్తూ పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఘనీని హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు.
హిందూపురంలో 1985 నుంచి 2014 వరకూ జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘనీ చేరికతో హిందూపురంలో ఉన్న మైనారిటీ ఓట్లు చీలుతాయనీ, అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడైతే టీడీపీని మట్టికరిపించవచ్చన్న ఆలోచనతో వైసీపీ ఉంది. ఈ క్రమంలోనే ఘనీకి హిందూపురం బాధ్యతలను జగన్ అప్పగించినట్లు తెలుస్తోంది.
కాగా, 2009లో ఘనీ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినా, 2014లో బాలయ్య కోసం ఆ సీటును త్యాగం చేశారు. అయితే వైసీపీ అధినేత జగన్ నిర్ణయంపై హిందూపురం వైసీపీ కన్వీనర్ నవీన్ నిశ్చల్ ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న తమను కాదని బయటివారికి టికెట్ ఇస్తే ఎలాగని ఆయన కన్నీరుపెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.