Uttam Kumar Reddy: ఎన్నికలకు ముందే ఏర్పడ్డ కూటమికి అధిక సీట్లు వస్తే దాన్నే గవర్నర్ ఆహ్వానించాలి: ఉత్తమ్
- ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనే విషయంలో నిబంధనలు ఉన్నాయి
- గతంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిర్ణయం తీసుకోవాలి
- కూటమిలోని అన్ని పార్టీల సీట్లు ఒక పార్టీగానే పరిగణించాలి
- గవర్నర్ ని కలిసిన అనంతరం ఉత్తమ్
ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనే విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని, ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడిన పార్టీలకు అధిక సీట్లు వస్తే కూటమినే గవర్నర్ ఆహ్వానించాలని అన్నారు. గవర్నర్ నరసింహన్ ని ప్రజాకూటమి నేతలు కలిసిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, గతంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ ను కోరామని, కూటమిలోని అన్ని పార్టీలకు వచ్చిన సీట్లు ఒక పార్టీకి వచ్చినట్టుగానే భావించాలని కోరామని అన్నారు.
కొన్ని పార్టీలు ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడేందుకు యత్నిస్తున్నాయని, ఫలితాల ప్రకటన తర్వాత గెలిచిన అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కూడా నరసింహన్ ని కోరినట్టు చెప్పారు. అనంతరం టీ-టీడీపీ నేత ఎల్. రమణ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నిరంకుశ ధోరణి గురించి గవర్నర్ కు మరోసారి వివరించామని అన్నారు. ప్రజాకూటమిని ప్రజలు ఆదరించారని అన్నారు.