Rajasthan: తెలంగాణలో రాకపోయినా ఆనందోత్సాహాల్లో కాంగ్రెస్... 10 జనపథ్ లో అంబరాన్నంటిన సంబరాలు!
- రాజస్థాన్ చత్తీస్ గఢ్ కాంగ్రెస్ వే
- మధ్యప్రదేశ్ లో హోరాహోరీ
- స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్
తెలంగాణలో ఘోర పరాభవం ఎదురైనప్పటికీ, సోనియా గాంధీ నివాసమైన '10 జనపథ్'లో సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆ ప్రాంతానికి చేరుకుంటున్న వేలాది మంది కాంగ్రెస్ నేతలు బాణసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగగా, కీలకమైన రాజస్థాన్, చత్తీస్ గఢ్ లను కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టే. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీకన్నా కాంగ్రెస్ అధిక సీట్లలో ఆధిక్యంలో ఉంది.
రాజస్థాన్ లో 199 అసెంబ్లీ సీట్లుండగా, కాంగ్రెస్ 98, బీజేపీ 76 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీఎస్పీ 4 చోట్ల, ఇతరులు 21 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. చత్తీస్ గఢ్ లో బీజేపీ ఓటమి ఖాయమైపోయింది. 90 స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్ 56 చోట్ల, బీజేపీ 25 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. బీఎస్పీ 8 చోట్ల, ఇతరులు ఒక్క చోట ప్రభావం చూపుతున్నారు.
మధ్యప్రదేశ్ విషయానికి వస్తే, పోరు నువ్వా? నేనా? అన్నట్టు సాగుతుండగా, కాంగ్రెస్ కాస్తంత ముందంజలో ఉంది. 230 స్థానాల్లో 229 స్థానాల ట్రెండ్స్ వచ్చాయి. కాంగ్రెస్ 111 చోట్ల, బీజేపీ 108 చోట్ల ముందంజలో ఉన్నాయి. బీఎస్పీ 4, ఇతరులు ఆరు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.