kcr: ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నీ వీలైనంత వేగంగా భర్తీ చేస్తా: సీఎం కేసీఆర్
- ఉద్యోగ కల్పన జరగలేదనే బాధ యువతలో ఉంది
- ఖాళీలు భర్తీ చేస్తాం..అందులో అనుమానం లేదు
- రైతులకు ఏ బాధ లేకుండా చేస్తాం
అనుకున్న విధంగా ఉద్యోగ కల్పన జరగలేదనే బాధ యువతలో ఉందని, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నీ వీలైనంత వేగంగా భర్తీ చేస్తానని, అందులో ఎటువంటి అనుమానం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేటు రంగంలో విరివిగా ఉద్యోగాలు లభించే విధంగా చర్యలు తీసుకుంటానని, కంటి వెలుగు తర్వాత ఈఎన్టీ, డెంటల్ బృందాలు పల్లెల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నారు.
రైతులకు ఏ బాధ లేకుండా చేస్తామని, సస్యశ్యామల, శాంతియుత తెలంగాణను తయారు చేసుకుందామని, తెలంగాణలో ఉన్న అన్ని రకాల మైనారిటీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు. దళిత, గిరిజన కుటుంబాల్లో పేదరికం పోవడానికి కచ్చితమైన చర్యలు తీసుకుంటామని, దరిద్రం అనేది ఎవరినైనా దహిస్తుందని, దానికి కులం, మతం అనే తేడాలేదని, ఇతర కులాల్లోని పేదలను కూడా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.