Rahul Gandhi: మూడు రాష్ట్రాల విజయం రాహుల్ ఘనతే.. అధినేతపై కురుస్తున్న ప్రశంసల వర్షం!

  • ఏకధాటిగా 87 సభలు, ఏడు రోడ్డు షోలు
  • ప్రధాని మోదీని ఉక్కిరిబిక్కిరి చేసిన రాహుల్
  • బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేసిన కాంగ్రెస్ చీఫ్

ఐదు రాష్ట్రాల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించడం వెనక ఆ  పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కృషి ఉందని కాంగ్రెస్ పేర్కొంది. విశ్రాంతి తీసుకోకుండా ఏకధాటిగా ఆయన చేసిన ప్రచారమే కాంగ్రెస్‌కు విజయాలు తెచ్చిపెట్టిందని తెలిపింది. ఈ మొత్తం క్రెడిట్ ఆయనదేనని ప్రశంసించింది.

ఎన్నికల ప్రచారం మొదలైన అక్టోబరు 6 నుంచి ప్రచారం పరిసమాప్తం అయ్యే వరకు రాహుల్ రాష్ట్రాలను చుట్టేశారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. మొత్తంగా 87 సభలు, ఏడు రోడ్డు షోలు నిర్వహించారు. అలుపు లేకుండా పాల్గొన్నారు. ఉత్సాహంగా ప్రసంగించారు. ముఖ్యంగా బీజేపీ విధానాలపైనా, ప్రధాని మోదీపైనా దుమ్మెత్తి పోశారు.

దేశంలోని రైతుల దుస్థితిని వివరించారు. రాఫెల్ కుంభకోణంపై ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అవినీతి, మహిళల భద్రతపై ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇక మధ్యప్రదేశ్‌లో విజయం ఖాయమనుకున్న బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేశారు. వ్యాపం కుంభకోణంపై విరుచుకుపడ్డారు. ఫలితంగా ఓటర్లను ఆకర్షించగలిగారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అదే కారణమని చెబుతున్నారు. రాహుల్ ప్రచారమే తమకు విజయాలు తెచ్చిపెట్టిందని సచిన్ పైలట్, అశోక్ గెహ్లట్‌లు తెలిపారు. రాహుల్ అద్భుత ఫలితాలు సాధించారని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ప్రశంసించారు.

  • Loading...

More Telugu News