geetha reddy: కాంగ్రెస్ దిగ్గజాలు కూడా ఓడిపోవడం అనుమానాలకు తావిస్తోంది: గీతారెడ్డి
- జానారెడ్డి లాంటి నేతలు కూడా ఓడిపోవడం ఆశ్చర్యకరం
- టీఆర్ఎస్, బీజేపీలు డబ్బు, మందు పంపిణీ చేశాయి
- ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని ఈసీని కోరాం
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి గీతారెడ్డి అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని, ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలను కూడా చేశామని ఆమె తెలిపారు. అయినా, ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన దిగ్గజ నేతలు కూడా ఓడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. జానారెడ్డిలాంటి సీనియర్లు కూడా ఓడిపోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని ఇప్పటికే ఎన్నికల సంఘానికి వినతిపత్రాన్ని అందించామని చెప్పారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు నుంచి టీఆర్ఎస్, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నగదు, మందు పంపిణీ చేశారని ఆరోపించారు. పోలీసులు, ఎన్నికల అధికారులకు దీనిపై ఫిర్యాదు చేసినా... వారు పట్టింకోలేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుపై తాను మాట్లడనని... తెలంగాణలో ఓటమిపై విశ్లేషణ చేస్తామని చెప్పారు.