paruchuri: పవన్! నీ నోట ఓటమి మాట రాకూడదు: పరుచూరి గోపాలకృష్ణ సలహా
- వ్యక్తిగతంగా రెచ్చగొట్టడానికి చూస్తారు
- అవకాశవాదుల విషయంలో జాగ్రత్త
- నువ్వు అనుకున్న మార్గంలోనే వెళ్లు
కథా రచయితగా .. సంభాషణల రచయితగా కొన్ని వందల సినిమాలకి పనిచేసిన అనుభవం పరుచూరి గోపాలకృష్ణ సొంతం. తాజాగా ఆయన 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. "పవన్ కల్యాణ్ ను చూస్తుంటే రోజు రోజుకి ఆయనలో పరిణతి కనిపిస్తోంది. ఆయన తీరు .. ఉపన్యాస శైలి మారాయి. అయితే ఇలాంటి ఉపన్యాసాలలో కొన్ని పదజాలాలు వాడకూడదు. 'నేను ఓడిపోయినా' అనే మాటను ఎప్పుడూ అనకూడదు .. నువ్వు గెలుస్తావనే మేమంతా నమ్ముతున్నాం.
ఏ రాజకీయనాయకుడు కూడా ఓటమి శబ్దాన్ని నోటితో చెప్పకూడదు. పవన్ ఆ తరువాత అన్నాడు .. 2019లో నేనే సీఎం అని .. అందుకు అంతా సంతోషించారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా రెచ్చగొట్టడానికి చూస్తారు .. అప్పుడు మనం కూడా వ్యక్తిగతంగా వెళ్లిపోయే అవకాశాలు ఏర్పడతాయి. పవన్ .. అలాంటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వ్యవస్థలోని తప్పులను ప్రశ్నించడానికి వెళ్లావు .. అదే మార్గంలో వెళ్లు. అవకాశవాదుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి" అని ఆయన సూచించారు.