shaktikanta das: ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడతా.. మరింత ఉన్నత స్థాయికి తీసుకెళతా: కొత్త గవర్నర్ శక్తికాంత దాస్
- ఆర్బీఐ గౌరవాన్ని కాపాడతా
- బ్యాంకుల సమస్యలపై దృష్టి సారిస్తా
- డిప్యూటీ గవర్నర్ గా ఆచార్య కొనసాగుతారు
ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుతానని ఆ సంస్థ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సంస్థ సిద్ధాంతాలు, ప్రొఫెషనలిజం, గౌరవాన్ని ఏమాత్రం కోల్పోనివ్వనని ఆయన తెలిపారు. ఆర్బీఐ గవర్నర్ గా పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. దేశ ఆర్థిక స్థితిని ఉన్నత పథంలోకి తీసుకెళ్లేందుకు అందరితో కలసి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
రేపు ఉదయం ప్రభుత్వ బ్యాంకుల సీఈవోలు, ఎండీలతో సమావేశం నిర్వహిస్తున్నామని దాస్ చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులది కీలక పాత్ర అని... అయితే, ఆ రంగం అనేక సమస్యలతో సతమతమవుతోందని చెప్పారు. ఈ ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను వెంటనే దృష్టి సారించాల్సిన అంశం బ్యాంకులేనని చెప్పారు. దేశ ఆర్థిక రంగానికి సంబంధించి సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆచార్య తప్పుకుంటున్నారనే వార్తలను ఆయన ఖండించారు. కొన్ని గంటల క్రితమే ఆచార్యతో కలసి తాను తేనీరు సేవించానని చెప్పారు. ఆచార్య డిప్యూటీ గవర్నర్ గా కొనసాగుతారని తెలిపారు.