Andhra Pradesh: ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు.. ఎల్లుండి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు

  • దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన
  • నేడు, రేపు పొడి వాతావరణం
  • మత్స్యకారులకు హెచ్చరిక

వాయుగుండం రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. ఇటీవల సంభవించిన తిత్లీ తుపాను నుంచి కోలుకోకముందే మరో తుపాను ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం అలాగే కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని పేర్కొంది.

మరో 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. ఫలితంగా ఈ నెల 15 నుంచి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు చేసింది. అయితే, గురు, శుక్రవారాల్లో మాత్రం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది.

వాయుగుండం ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే, తీరం వెంబడి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News